పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!

  • అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీవ్ర విమర్శలు
  • సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ప్రభుత్వ సొమ్ము వృథా చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
పాట్నా రైల్వే స్టేషన్‌లో అధికారుల నిర్లక్ష్యం, ప్రయాణికుల హడావిడి కలగలిసి ఓ వింత ఘటనకు దారితీసింది. మరమ్మతుల కోసం కొత్తగా వేసిన కాంక్రీట్ ఆరకముందే, వందలాది మంది ప్రయాణికులు దానిపై నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాట్నా స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై మరమ్మతు పనుల్లో భాగంగా రైల్వే సిబ్బంది కాంక్రీట్ వేశారు. అయితే అది పూర్తిగా ఆరకుండానే, ఓ రైలు ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. దీంతో రైలు దిగిన ప్రయాణికులు చేసేదేంలేక తమ లగేజీలతో తడి కాంక్రీట్‌పై నుంచే స్టేషన్ బయటకు వెళ్లారు. పాదాలు కాంక్రీట్‌లో దిగబడుతున్నా వారికి మరో దారిలేకుండా పోయింది.

ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీగా ఉండే పగటిపూట ఇలాంటి పనులు చేపట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంక్రీట్ వేసిన ప్లాట్ ఫాంపై రైలును ఆపడం అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు.

ప్రయాణికుల పాదాల గుర్తులు పడిపోవడంతో ప్లాట్‌ఫామ్ రూపురేఖలు మారిపోయాయి. దీంతో చేసిన పని వృథా అయి, ప్రభుత్వ ధనం బూడిదలో పోసిన పన్నీరైంది. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ప్రయాణికులు నవ్వుకుంటూ వెళ్తుండగా, మరికొందరు అధికారుల తీరును తిట్టుకుంటూ వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.

Patna Railway Station
Patna Station
Indian Railways
railway platform
concrete work
negligence
viral video
passenger inconvenience
Bihar

More Telugu News